Ys Jagan: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్,వైసీపీ ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం సుమారు గంటపాటు సాగనున్నట్లు సమాచారం. అనంతరం ఉదయం 11.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సమావేశాల వ్యవధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు సుమారు 20 రోజుల పాటు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు
బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలో జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటీవల వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, అలాగే తిరుమల లడ్డూ అంశంలో ప్రభుత్వ వైఖరిపై సభలో ఎలా స్పందించాలన్న విషయాలపై ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
వివరాలు
వైసీపీ తొలి రోజు సమావేశాలకే పరిమితం అయ్యే అవకాశం
ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో వైసీపీ అనుసరించాల్సిన తుది వ్యూహంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగ సమయంలో జగన్ అసెంబ్లీకి హాజరై, ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయన తొలి రోజు సమావేశాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
వివరాలు
శాసనసభా పక్ష సమావేశం పూర్తైన తర్వాత పార్టీ అధికారిక నిర్ణయం
అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ మండలి సభ్యులు యథావిధిగా హాజరవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలకు సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి హాజరవుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కీలక అంశాలపై గట్టిగా నిలదీయడమే వైసీపీ లక్ష్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశం పూర్తైన తర్వాత పార్టీ తన అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనుంది.