KP Unnikrishnan: మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూశారు. 1980లు, 1990లలో భారత రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో కొజికోడ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వడకర నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆరు సార్లు ఎన్నికై విశేష సేవలు అందించారు. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన, 1977, 1980, 1984, 1989, 1991లోనూ వరుసగా విజయం సాధించారు. 1989-90లో వీపీ సింగ్ మంత్రివర్గంలో సర్ఫేస్ ట్రాన్స్‌పోర్ట్,కమ్యూనికేషన్స్ శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారు.
వివరాలు
రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా..
గల్ఫ్ యుద్ధం సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం ఆయన పదవీకాలంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేసిన ఉన్నికృష్ణన్ చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. అదే నగరంలో న్యాయ విద్యను పూర్తి చేశారు.మొదట సోషలిస్ట్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన,తరువాత ప్రజా సోషలిస్ట్ పార్టీలో కొనసాగి,1960లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వి.కె.కృష్ణ మేనన్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన ఉన్నికృష్ణన్,మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి విశ్వసనీయుడిగా కూడా పనిచేశారు. అయితే తరువాత రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్‌ను విడిచారు. కాంగ్రెస్(యూ),కాంగ్రెస్(ఎస్)వంటి వర్గాలతో అనుబంధం కొనసాగించిన ఆయన,చివరకు 1995లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మృతి పట్ల రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.