Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి-544డిలో నాలుగు వరుసలుగా విస్తరణకు సంబంధించి రెండు కీలక ప్యాకేజీలకు ఆమోదం లభించింది.
ఇందులో బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కి.మీ కలిపి మొత్తం 219.80 కి.మీ విస్తరణ పనులు ఉంటాయి.
ఈ రెండు ఎలైన్‌మెంట్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పనులకు రూ.5,417 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. అదనంగా ఈ రెండు ప్యాకేజీలలో 21 చోట్ల బైపాస్‌లు నిర్మించడానికి అనుమతి ఇచ్చారు.
Details
గిద్దలూరు-వినుకొండ మినహా
అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎన్‌హెచ్-544డి జాతీయ రహదారి ముచ్చుకోట, బుగ్గ, కైప, గిద్దలూరు, వినుకొండ మీదుగా విస్తరించింది.
ప్రస్తుతం అనంతపురం నుంచి బుగ్గ వరకు నాలుగు వరుసలుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి.
గిద్దలూరు-వినుకొండ మధ్య 135 కి.మీ రెండు వరుసలుగా విస్తరించి 2022లో పూర్తిచేసి నిర్వహణను గుత్తేదారుకు అప్పగించారు. మిగిలిన బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు విభాగాలు మాత్రమే విస్తరించాల్సి ఉంది.
తాజా నిర్ణయంతో ఈ రెండు భాగాలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.
తద్వారా, అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న రహదారిలో గిద్దలూరు-వినుకొండ 135 కి.మీ మినహా మిగతా రహదారులన్నీ నాలుగు వరుసలుగా మారనున్నాయి.
Details
అటవీ ప్రాంతంలోనూ నాలుగు వరుసలు
బుగ్గ-గిద్దలూరు విస్తరణలో 135 కి.మీ లోపు 25 కి.మీ నల్లమల రక్షిత అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రెండు వరుసలుగా మాత్రమే విస్తరించాలని మొదట భావించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో కూడా నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదం ఇచ్చింది.
కానీ అటవీ అనుమతులు పొందడంలో జాప్యం జరిగితే, ఆ 25 కి.మీ ప్రాంతాన్ని రెండు వరుసలుగా మాత్రమే పరిమితం చేయాలని కమిటీ సూచించింది.
వినుకొండ-గుంటూరు విస్తరణలో రహదారి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పేరేచర్ల సమీపంలో కలిసేలా ప్రత్యేకంగా నిర్ణయించారు.