'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను ఘనంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. శ్రీరాముడి ప్రతిష్ఠాపన జరిగే జనవరి 22వ తేదీని హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట రోజునే తమకు ప్రసవం చేయాలని గర్భిణులు డాక్టర్లను వేడుకుంటున్నారు. ఆరోజున ప్రసవం అయితే సాక్షాత్తు శ్రీరాముడే జన్మిస్తాడని నమ్నుతున్నారు. అందుకే జనవరి 22న తేదీన డెలివరీ చేయాలని వైద్యులను వేడుకుంటున్న గర్భిణుల సంఖ్య యూపీతో పాటు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.
యూపీ మొత్తం వేల సంఖ్యలో గర్భిణులు డెలివరీకి వెయింటింగ్
యూపీ కాన్పూర్‌లోని ఒక్క జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోనే 25మంది గర్భిణులు జనవరి 22వ తేదీన డిలివరీ సిద్ధంగా ఉన్నట్లు ప్రొఫెసర్ సీమా ద్వివేది చెబతున్నారు. ఒక్క ఆస్పత్రిలోనే ఇంత మంది ఉంటే.. కాన్పూర్‌లోని మిగతా ఆస్పత్రులను కలిపితే ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక యూపీలోని మొత్తం ఆస్పత్రులను కలిపి 22వ తేదీన డెలివరీకి వేచి చూస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉండే ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు సైతం ఆరోగ్యంగా ఉన్న వారికి ఆరోజే సాధ్యమైనన్ని ఎక్కువ డెలివరీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.