LOADING...
Delhi: Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి
దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి

Delhi: Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
07:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌కు సమీపంలో నిలిపివున్న ఒక కారులో అకస్మాత్తుగా భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు తీవ్రత కారణంగా కొన్ని మృతదేహాలు పూర్తిగా ఛిద్రం అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.55 గంటలకు ఈ ఘటనపై సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ఏడు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.

వివరాలు 

భీతావహ వాతావరణం 

మరోవైపు, దిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్ టీమ్‌, ఎన్‌ఐఏ అధికారులు కూడా సంఘటనా ప్రదేశానికి చేరుకుని విచారణను ప్రారంభించారు. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా భయాందోళనలో మునిగిపోయింది. పేలుడు ప్రభావంతో సమీపంలో నిలిపివున్న అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. మొత్తం ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా పూర్తిగా కాలిపోయాయి. కారులో పేలుడు పదార్థాలు పెట్టి, వాటిని దూర నియంత్రణ (రిమోట్‌ కంట్రోల్‌) సహాయంతో పేల్చి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ప్రకారం, ప్రతి సోమవారం దిల్లీలోని పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు మూసివేతలో ఉండటంతో జనసంచారం తక్కువగా ఉంది. అందువల్ల పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని చెబుతున్నారు.

వివరాలు 

దిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం 

"నేను ఆ సమయంలో గురుద్వారా వద్ద ఉన్నాను. అకస్మాత్తుగా భారీ శబ్దం వచ్చింది. ఏం జరిగిందో ముందుగా అర్థం కాలేదు. పేలుడు తర్వాత పక్కనే ఉన్న కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి" అని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఉదయం భారీగా పేలుడు సామగ్రి పట్టుబడటం.. సాయంత్రమే దిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో దిల్లీ సహా పరిసర నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా దిల్లీ-హరియాణా-యూపీ సరిహద్దు పాయింట్ల వద్ద అదనపు భద్రతను అమలు చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

దిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం 

రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పోలీసు తనిఖీలు పెంచారు. క్రైం బ్రాంచ్‌, స్పెషల్ సెల్‌ టీమ్స్‌కు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు జారీ అయ్యాయి. సింఘు, టిక్రీ, బదర్‌పుర్‌ సరిహద్దుల వద్ద అదనపు పట్రోలింగ్, పికెట్‌లు ఏర్పాటు చేసి, వాహనాలు మరియు లాడ్జీలపై దీటైన తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement