Shilpa Shetty: సోషల్ మీడియాలో శిల్పా శెట్టి డీప్‌ఫేక్ వీడియోలు.. గోప్యత ఉల్లంఘనపై కోర్టు సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు సైబర్ నేరగాళ్లు హద్దులు దాటుతున్నారు. ప్రముఖ సినీ తారలను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty)కు సంబంధించిన అసభ్యకర డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నటి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఏఐ (AI) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్స్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలలో కొన్ని కేవలం రెండు రోజుల క్రితమే అప్‌లోడ్
తన పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకర డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం అవుతున్నాయని పేర్కొంటూ శిల్పా శెట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలలో కొన్ని కేవలం రెండు రోజుల క్రితమే అప్‌లోడ్ అయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విషయం మరింత తీవ్ర స్థాయికి చేరకముందే దీనిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కంటెంట్ ఆమె వ్యక్తిగత హక్కులు, గోప్యతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
గోప్యతా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబొం: కోర్టు
దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు అత్యవసరంగా పిటిషన్‌ను విచారించింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న డీప్‌ఫేక్ కంటెంట్ పూర్తిగా అనుచితమైనదిగా, మానసికంగా కలత కలిగించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మహిళలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా ఫోటోలు తీసి, వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేయడం అత్యంత భయంకరమైన చర్యగా పేర్కొంది. ఇటువంటి గోప్యతా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని న్యాయస్థానం స్పష్టంగా హెచ్చరించింది.