
F-1 visa: భారీ స్థాయిలో విద్యార్థి వీసాల తిరస్కరణ.. 41శాతం దరఖాస్తులను ఆమోదించని అగ్రరాజ్యం
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేక మంది విద్యార్థుల కల. ముఖ్యంగా, అమెరికాలో విద్యను కొనసాగించాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు.
అందుకే ప్రతి ఏడాది ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు అమెరికాకు చేరుకుంటుంటారు.
అయితే, ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాల (F-1 Visa) మంజూరును గణనీయంగా తగ్గిస్తోంది.
గత ఆర్థిక సంవత్సరంలో, ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది దశాబ్దం క్రితంతో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరింది.
వివరాలు
2024 సంవత్సరంలో 38%
అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్-1 వీసాలకు 6.79 లక్షల దరఖాస్తులు అందగా, వీటిలో 2.79 లక్షలు (దాదాపు 41%) తిరస్కరణకు గురయ్యాయి.
అంతకుముందు 2022-23లో, 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు (36%) తిరస్కరించబడ్డాయి.
2013-14లో 7.69 లక్షల మంది విద్యార్థులు ఈ వీసాలకు అప్లై చేయగా, అప్పట్లో 1.73 లక్షలు (23%) మాత్రమే తిరస్కరించబడ్డాయి. కానీ, గతేడాది ఈ సంఖ్య రెట్టింపైంది.
అమెరికా ప్రభుత్వం దేశాల వారీగా తిరస్కరించిన వీసాల గణాంకాలను విడుదల చేయకపోయినప్పటికీ, 2024 సంవత్సరంలో భారతీయ విద్యార్థుల ఎఫ్-1 వీసా మంజూరు 38% తగ్గినట్లు డిసెంబరు 9 నాటికిన గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
ఎఫ్-1 వీసా అంటే ఏమిటి?
కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ విద్యార్థుల వీసాల మంజూరు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.
బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నివేదిక ప్రకారం, 2024 జనవరి-సెప్టెంబర్ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేయగా, 2023 ఇదే కాలంలో 1.03 లక్షల విద్యార్థులకు వీసాలు మంజూరయ్యాయి.
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ విద్యార్థులకు అమెరికాలో ఫుల్-టైమ్ విద్యను అభ్యసించేందుకు అనుమతిస్తుంది.
ప్రతి ఏడాది రెండు సెమిస్టర్‌ల (ఆగస్టు-డిసెంబర్, జనవరి-మే) సమయంలో ప్రవేశాలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యంగా ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్‌లో భారతీయ విద్యార్థులు అధికంగా అమెరికాకు వెళ్తుంటారు.