Pakistan's Online Campaign: భారత్‌పై పాక్ ఆన్‌లైన్ కుట్రలు.. నకిలీ ఖాతాలు, డీప్‌ఫేక్‌లతో విష ప్రచారం!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో తప్పుడు ప్రచారానికి తెరలేపినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయ నాయకత్వం,సైన్యం,భద్రతా సంస్థలతో పాటు మత,కుల,ప్రాంతీయ విభేదాలను లక్ష్యంగా చేసుకుని వేలాది సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ప్రచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇలాంటి పలు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినప్పటికీ,కొత్త ఖాతాలు మళ్లీ పుట్టుకొస్తున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి. పాత ఘటనలకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను కొత్తవిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈ ప్రచారంలో ప్రధాన వ్యూహంగా ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్,జార్ఖండ్,పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో 2022,2024లో జరిగిన ఘటనల వీడియోలను 2026 నవంబర్‌లో కొత్త ఘటనలుగా ప్రచారం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
డీప్‌ఫేక్‌లతో సైన్యంపై తప్పుడు ప్రచారం.. మత ఉద్రిక్తతలు పెంచే యత్నం
తప్పుడు క్యాప్షన్లు, మార్చిన ఆడియో, నకిలీ తేదీలు, వార్తా టిక్కర్లతో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా భారత సైన్యంపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నట్లు భద్రతా వర్గాలు గుర్తించాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పేరుతో పాకిస్థాన్ సైనిక రంగంలో భారత్ కంటే ముందుందని చెప్పినట్లు నకిలీ వీడియో ప్రచారం చేశారు.
ఆర్మీ చీఫ్‌ను పదవి నుంచి తొలగించబోతున్నారంటూ తప్పుడు వార్తలు సృష్టించారు.
మరోవైపు ఘజియాబాద్‌లో ఐదు మసీదులను కూల్చివేశారని, కోల్‌కతాలో ప్రార్థనల సమయంలో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు చనిపోయారని వంటి నిరాధార ప్రచారాలతో మతపరమైన ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేసినట్లు నివేదిక తెలిపింది.
వివరాలు
భారతీయుల ముసుగులో నకిలీ ఖాతాలు..
ఈ ప్రచారంలో భారతీయుల పేర్లు, ప్రాంతీయ గుర్తింపులతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
'అనుషి తివారీ' పేరుతో ఉన్న ఖాతాలు సహా పలు అకౌంట్ల ద్వారా మతం, కశ్మీర్, సిక్కుల గుర్తింపు, నిరసనలు వంటి అంశాలపై వివాదాస్పద పోస్టులు పెడుతున్నట్లు గుర్తించారు.
ఒక ఖాతాలో పెట్టిన పోస్టులను మరికొన్ని ఖాతాలు షేర్ చేయడంతో పాటు, పాకిస్థాన్ మీడియా సంస్థలు కూడా వాటిని ప్రచారం చేస్తున్నట్లు వెల్లడైంది.
వివరాలు
ఐఎస్‌పీఆర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్రచారం!
ఈ వ్యవస్థీకృత ప్రచారం వెనుక పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ (Inter-Services Public Relations) విభాగం ఉన్నట్లు భారత భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
2015 నుంచి యువతను సోషల్ మీడియా ప్రచారానికి వాలంటీర్లుగా చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాయి.
మీమ్స్, వీడియోలు రూపొందించడం, ప్రచారానికి ఉపయోగపడే సమాచారాన్ని గుర్తించడం వంటి పనులను వారికి అప్పగిస్తున్నట్లు తెలిపాయి.
పాత వీడియోలు, డీప్‌ఫేక్‌లు, నకిలీ ఖాతాల ద్వారా ప్రజల్లో విభేదాలు పెంచడమే ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.