Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్ తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించినట్లు సమాచారం. గత ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి తరలించి, సిట్ అధికారులు దాదాపు 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ సమయంలో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, అలాగే కలిపి ప్రశ్నించారు.
Details
న్యాయమూర్తి ఎదుట జోగి రమేశ్
ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధనరావుతో జోగి రమేశ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ వాదనలు తెల్లవారుజామున వరకు కొనసాగగా, చివరికి న్యాయమూర్తి ఉదయం 5 గంటల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. తదుపరి చర్యగా, జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును మొదట విజయవాడ జైలుకు తరలించగా, తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా వారిద్దరినీ నెల్లూరు జైలుకు మార్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.