Oil Palm Cultivation: రైతులకు బాగు.. ఆయిల్‌పామ్ సాగు.. నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి.
కానీ రైతుల్లో ఈ పంటపై సందిగ్ధత నెలకొంది. ఉద్యానవన శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా కనీసం ఒక కోటి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తేనే దేశీయ వంట నూనెల అవసరాలు తీరతాయి.
ప్రస్తుతం మాత్రం దేశంలో కేవలం 7లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది.
అంటే మరో 93లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటి వరకు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది.
వివరాలు
రైతుల్లో సందిగ్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ప్రాంతంలో 20 ఏళ్లుగా ఆయిల్ పామ్ సాగు కొనసాగుతుంది.
రాష్ట్రంలోని పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో ఉన్నాయి.
ఇంకా తెలంగాణలో 14 కొత్త ఫ్యాక్టరీలను స్థాపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి.లాభమా? నష్టమా? ప్రభుత్వం ఎంతవరకు సహాయపడుతుంది అన్న చర్చలు జరుగుతున్నాయి.
నల్గొండ జిల్లా పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులకు హామీ ఇచ్చారు.
ఆయిల్ పామ్ సాగు వల్ల ఎకరానికి రూ.లక్షన్నర నుండి రూ.రెండు లక్షల వరకు లాభం వస్తుందని చెప్పారు.
వివరాలు
రైతుల్లో సందిగ్ధం
2022లో లక్ష ఎకరాల లక్ష్యానికి గాను 89 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు పూర్తయింది.
2023లో లక్ష ఎకరాలకు గాను 1,03,000 ఎకరాల్లో సాగు చేశారు. 2024లో 70,000 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ధరల్లో తేడాలు, పంట లాభాలను ప్రభావితం చేస్తూ రైతుల్లో అయోమయం సృష్టించాయని నిడమనూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పామాయిల్ రైతు గోపాలకృష్ణ పేర్కొన్నారు.
ఆయన పదేళ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు పామాయిల్ కనీస మద్దతు ధరను టన్నుకు రూ.10,000గా నిర్ణయించింది.
వివరాలు
పామాయిల్ కి మద్దతు ధర
ఫ్యాక్టరీలతో బై బ్యాక్ ఒప్పందాలు ఉన్నందున రైతులకు మార్కెట్ రేటు రూ.20,000వరకు లభించవచ్చని అధికారులు చెబుతున్నారు.
అలాగే,ప్రతి 15కిలోమీటర్లలో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సరుకు రవాణా భారం తగ్గించారని తెలిపారు.
ప్రతి ఎకరా పామాయిల్ నుండి వచ్చే దిగుబడి 9ఎకరాల వేరుశనగ నుండి వచ్చే నూనెకు సమానంగా ఉంటుంది.
పొద్దుతిరుగుడు పంటతో పోలిస్తే 12ఎకరాలు,కుసుమ పంటతో 25 ఎకరాలు,నువ్వులతో 37ఎకరాలకు ఆయిల్ పామ్ సమానమని హర్టీకల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ వివరించారు.
ఇటీవలే నల్గొండ జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం 10,000ఎకరాలు దాటడంతో పతంజలి కంపెనీ ఆధ్వర్యంలో కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.