Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు
రైతు నాయకులు, కేంద్రం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం రైతులు దిల్లీలో మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది. దిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా నిరోధించడానికి రైతులు సరిహద్దుల్లో మల్టీ లేయర్డ్ బారికేడ్లు, కాంక్రీట్, ఇనుప స్పైక్‌లు, కంటైనర్ గోడలను ఏర్పాటు చేశారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దులో భారీగా మోహరించారు. అంతేకాకుండా 'కొన్ని చోట్ల' తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. రైతుల మార్చ్ కారణంగా నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఒక నెలపాటు దేశ రాజధానిలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, ప్రజలను తీసుకెళ్ళే ట్రాక్టర్ ట్రాలీలకు దిల్లీలో ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారమే దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చేలా చట్టం చేయడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి పాదయాత్ర చేస్తారని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల నిరసన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. రైతు సంఘాల నాయకులతో సోమవారం చర్చలు జరిపింది. ఇద్దరు కేంద్ర మంత్రులు రైతు నాయకులతో మాట్లాడారు. అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సోమవారమే ట్రాక్టర్-ట్రాలీల్లో నిరసనలో పాల్గొనడానికి రైతులు వచ్చారు.