భోపాల్: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్, అగ్నిమాపక దళం సంయుక్తంగా గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభావిత అంతస్తులన్నింటిలో మంటలు అదుపులోకి వచ్చాయని, ఆరో అంతస్తు నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయని, అగ్నిమాపక సిబ్బంది ఆ పొగలను నియంత్రించే పనిలో ఉన్నారని, దీనికి ఇంకో రెండు గంటల సమయం హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ రాజోరా చెప్పారు. ఉదయం దిల్లీ నుంచి వచ్చిన ఆయన భవనం పరిస్థితిని సమీక్షించారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు
భోపాల్‌లోని సాత్పురా భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, అయితే ఘటనపై విచారణ జరుపుతామన్నారు. మంటలు వ్యాపించడంతో అధికారులు, ఉద్యోగులందరినీ సకాలంలో సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక యంత్రాలు, ఆర్మీ, సీఐఎస్ఎఫ్ సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తోందని భోపాల్ కలెక్టర్ అషీష్ సింగ్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.