LOADING...
Begumpet Airport: దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద ఆరు లేన్ల సొరంగం
దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద ఆరు లేన్ల సొరంగం

Begumpet Airport: దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద ఆరు లేన్ల సొరంగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద 600మీటర్ల పొడవుతో ఆరు లేన్ల అండర్‌పాస్ సొరంగం నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)పరిశీలనలో ఉంది. మరో రెండు వారాల్లో అనుమతులు లభించే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్యారడైజ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు నిర్మాణంలో ఉన్న 5.5కిలోమీటర్ల కారిడార్‌లో భాగంగా ఈ సొరంగ మార్గాన్ని ప్రతిపాదించారు. ముఖ్యంగా తాడ్‌బండ్ ప్రాంతంలో ఉన్న ఒక మలుపు రహదారి విస్తరణకు అడ్డంకిగా మారడంతో, సమస్యకు పరిష్కారంగా రన్‌వే కింద సొరంగ మార్గాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

వివరాలు

ఈ ప్రాజెక్టుకు త్వరలోనే అనుమతులు

దీనికి సంబంధించిన డిజైన్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), AAI సంయుక్తంగా సమీక్షిస్తున్నాయి. దేశంలోనే మొదటిసారిగా నగర ట్రాఫిక్ కోసం విమానాశ్రయం రన్‌వే కింద భూగర్భ మార్గాన్ని నిర్మిస్తున్నట్లు గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్లు AAI ఛైర్మన్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం కింద కూడా అండర్‌పాస్ నిర్మాణం కొనసాగుతోంది. అయితే తెలంగాణ తర్వాత యూపీ ప్రభుత్వం దరఖాస్తు చేసినప్పటికీ, బీజేపీ పాలిత రాష్ట్రానికి ముందుగానే అనుమతులు లభించాయని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement