Bhadrachalam: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నాటికి గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. నీటిమట్టం పెరగడంతో కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
వివరాలు
సమ్మక్క బ్యారేజీకి భారీగా వరద.. 59 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల
ఇదే సమయంలో ములుగు జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
మేడిగడ్డ ప్రాంతం నుంచి సుమారు 8.35 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తుండటంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది.
దీంతో బ్యారేజీకి ఉన్న 59 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ప్రభావం వల్ల వాజేడు మండలం టేకులగూడెం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా అంతరాయానికి గురైంది.
అలాగే వెంకటాపురం మండలం బోదాపురం వంతెనపైకి కూడా వరద నీరు చేరడంతో వెంకటాపురం-భద్రాచలం మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.