LOADING...
Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి
విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి

Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ పోర్టులో ఈ కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన రోష్ని అపరాంజి కోరాటి విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే పూర్తి చేయడం విశేషం. ఆమె తండ్రి విశాఖపట్నం పోర్టు హై స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. తండ్రి సేవలందించిన అదే సంస్థకు కుమార్తె డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్ 3, 1984న జన్మించిన రోష్ని అపరాంజి కోరాటి, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

Details

అదనపు ఉప కమిషనర్ గా సేవలందించిన అనుభవం

జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఆమెకు విశేషమైన పరిపాలనా అనుభవం ఉంది. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో అదనపు ఉప కమిషనర్‌గా సేవలందించిన ఆమె, అదే జిల్లాకు కలెక్టర్‌గా, జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులకానున్న ముందు, డిప్యుటేషన్‌పై విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ)లో జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో ప్రజా పరిపాలన రంగంలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రధాని అవార్డు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి.

Advertisement