LOADING...
Electric Shock: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి
కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి

Electric Shock: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి కృష్ణాష్టమి సంబరాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. గోకులేనగర్‌ ప్రాంతంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి ఊరేగింపు సమయంలో రథం ఎత్తైన విద్యుత్‌ తీగలకు తగలడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌కు గురైన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా,మరొక నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణాష్టమి శోభాయాత్రలో భాగంగా రథం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో రథం పైభాగం ఎలక్ట్రిక్‌ వైర్లను తాకింది. ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మంది యువకులకు షాక్ కొట్టడంతో దూరంగా ఎగిరిపడిపోయారు.

వివరాలు 

గాయపడిన నలుగురిలో కేంద్ర మంత్రి  గన్‌మెన్‌ 

ఈ ఘటనతో ఈ ప్రమాదంతో ఊరేగింపు ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఐదుగురి పరిస్థితి అప్పటికే విషమించడంతో వైద్యులు వారు మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌ (34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్‌ (39), రాజేంద్రరెడ్డి (45). వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికి వారందరికీ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.