
Vijayawada: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి నీటివిడుదల
ఈ వార్తాకథనం ఏంటి
పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన అధికార యంత్రాంగం,లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగా హెచ్చరికలు జారీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈనేపథ్యంలో,వరద ప్రవాహ పరిస్థితులను రౌండ్ ది క్లాక్ పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా,జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. విజయవాడ నగరపరిధిలో మొత్తం 43లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించినట్టు సమాచారం. వరద ప్రమాదం నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని కలెక్టర్ స్పష్టం చేశారు.
వివరాలు
బ్యారేజీ నుంచి సముద్రంలోకి 60 వేల క్యూసెక్కుల నీటి విడదల
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో మొత్తం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి వరద నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెప్పారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 60 వేల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నట్టు, అలాగే ఈస్ట్, వెస్ట్ కెనాల్స్ ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశామని కలెక్టర్ వివరించారు.