
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రవాహ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ శ్రీశైలం జలాశయాన్ని ముంచెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచీ కూడా శ్రీశైలానికి వరద నీరు వస్తోంది. ఫలితంగా, అధికారులు రెండు రేడియల్ క్రెస్ట్ గేట్లను పది అడుగుల వరకు ఎత్తి, దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ చర్యల నడుమ శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 75,383 క్యూసెక్కులు నమోదవుతుండగా, ఔట్‌ఫ్లో 1,21,482 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 883.50 అడుగులకు చేరుకున్నది.
వివరాలు
రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఇక జలాశయం పూర్తి స్థాయిలో నిల్వ చేయగల నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీలుగా నమోదైంది. పైప్రాంతాల నుంచి వరద ప్రవాహం మరింత పెరుగుతుండటంతో,అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ,అవసరమయ్యే చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా, రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.