Jurala Project: కృష్ణమ్మ పరవళ్లు.. జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి మళ్లీ జలకళ వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగి, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీరు చేరడం ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ఆనకట్టలకు భారీగా వరద చేరుతుండటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆదివారం రాత్రి నాటికి జూరాల ప్రాజెక్టుకు 22,600 క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
5.897 టీఎంసీల నీటి నిల్వ నమోదు
జూరాల జలాశయంలో ప్రస్తుతం 5.897 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.
ఇదే స్థాయిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే,త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీటి ప్రవాహం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
అయితే జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాతే ఎత్తిపోతల పథకాలు,కాలువలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.
ఇక నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీఎల్‌ఐ) పథకం ద్వారా సోమవారం నుంచి రిజర్వాయర్లకు నీటిని పంపించడం ప్రారంభించినట్లు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఈఈ లోకిలాల్ తెలిపారు.
సింగోటం,జొన్నలబొగుడ,గుడిపల్లి రిజర్వాయర్లను నిరంతరాయంగా నింపేలా చర్యలు చేపట్టామని చెప్పారు.
నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
దేశవ్యాప్తంగా రుతుపవనాలు దాదాపు 90 శాతం ప్రాంతాలకు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.