
Srisailam Bridge: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అక్కడ 27 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఆ వరద నీరు శ్రీశైలానికి చేరుకుంటోంది. ఇదే సమయంలో సుంకేసుల నుంచి కూడా వరద కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
వివరాలు
జలాశయంలో 208.7210 టీఎంసీల నీరు నిల్వ
జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి కలిపి 1,03,587 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయపు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 208.7210 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌తోపాటు 67,346 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.