Cabinet Sub-Committee: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఫోకస్.. కేబినెట్ కమిటీ కీలక ఆలోచనలు
ఈ వార్తాకథనం ఏంటి
గత ప్రభుత్వ కాలంలో విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన భవనాల అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే నాలుగు సమావేశాలు నిర్వహించిన ఈ కమిటీ, తాజాగా ఐదోసారి సమావేశమై కీలక అంశాలపై సమగ్రంగా చర్చించింది. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి వర్చువల్‌గా పాల్గొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవనాల వినియోగంపై కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరిగినట్లు సమాచారం.
వివరాలు
సమర్థవంతంగా వినియోగించే విధానాలపై పలు ప్రతిపాదనలు
ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడం మాత్రమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎలా మలచాలన్న అంశంపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ దిగువన మరో 2400 చదరపు మీటర్లు—మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే విధానాలపై పలు ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ భవనాలను మార్చాలనే ఉద్దేశంతో కమిటీ ఆలోచనలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నాయి.
వివరాలు
ప్రతి నెల సుమారు రూ.25 లక్షల ప్రజా ధనం ఖర్చు
తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రముఖ హోటల్ గ్రూపులు ముందుకు వస్తున్న నేపథ్యంలో, మరిన్ని సంస్థలకు అవకాశాలు కల్పించే అంశంపై కూడా చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల సుమారు రూ.25 లక్షల ప్రజా ధనం ఖర్చవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ, అదే సమయంలో ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కేబినెట్ సబ్‌కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. అనంతరం ఆయన సూచనల మేరకు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.