Rajasthan: రాజస్థాన్ సీఎం ఎవరనేది బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుంది: రాజ్యవర్ధన్ రాథోడ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీంతో రాజస్థాన్ సీఎంగా బీజేపీ ఎవరిని నియమిస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర క్రీడా మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అలాగే రాజస్థాన్‌లో తమ పార్టీ మరి సీట్లను గెలుచుకునే అవకాశం ఉందనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలన, ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన మధ్య పోరు జరిగిందన్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ విజయం సాధించదన్నారు.
సీఎం రేసులో ఎవరున్నారంటే..
రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వసుంధర రాజే సీఎం పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆమె 2003 నుంచి గత 20 సంవత్సరాలుగా రాజస్థాన్‌లో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి, కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ కూడా సీఎం బరిలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్‌కు మించి బీజేపీ భారీగా సీట్లను గెలుస్తుందని రాజవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు.