PM Modi: సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులపై అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
చారిత్రక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలనుకున్న శక్తులు నేటికీ సమాజంలో పనిచేస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అలాంటి శక్తులపై అప్రమత్తంగా ఉండి,ఐక్యతతో ఎదుర్కొని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో ఎన్నిసార్లు దాడులు జరిగినా ప్రతిసారీ సోమనాథ్ ఆలయం తిరిగి లేచిందని గుర్తు చేశారు. బలవంతంతో ప్రజల హృదయాలను గెలవడం ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయంపై గజనీ మహమ్మద్ తొలి దాడి చేసి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఆదివారం మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' పేరుతో జరిగిన భారీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
వివరాలు
పుణ్యక్షేత్ర విలువను విస్మరించారు
విధ్వంసం లేదా పరాజయం కాకుండా విజయం, పునర్నిర్మాణమే ఈ ఆలయ చరిత్రకు గుర్తింపని పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ప్రాధాన్యాన్ని చెరిపేయాలనే ప్రయత్నాలు గతంలో జరిగినట్లు మోదీ ఆరోపించారు. బానిస మనస్తత్వంతో ఉన్నవారు ఈ పుణ్యక్షేత్ర విలువను విస్మరించారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. స్వాతంత్య్రం తర్వాత ఆలయ పునర్నిర్మాణానికి ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన ప్రయత్నాలకు కొందరు అడ్డంకులు సృష్టించారని అన్నారు. అలాగే భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్‌ను దర్శించాలన్న నిర్ణయంపై కూడా అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు.
వివరాలు
భారత అస్తిత్వానికి ప్రతీక
వెయ్యేళ్ల క్రితం దురాక్రమణదారులు ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధించామని భావించారని మోదీ చెప్పారు. ఔరంగజేబ్ అయితే ఆలయాన్ని ఆక్రమించి అక్కడ మసీదు నిర్మించాలనుకున్నాడని పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలన్నీ చరిత్రలో కలిసిపోయినా,నేటికీ సోమనాథ్ ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఉదాహరణ మరొకటి లేదని వ్యాఖ్యానించారు. భారత అస్థిత్వానికి, గౌరవానికి 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' ఒక ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. సంపద కోసమే దాడి జరిగితే తొలి దాడితోనే ఆగిపోయేదని, కానీ పదేపదే దాడులు చేసి దైవాన్ని అపవిత్రం చేశారని తెలిపారు.
వివరాలు
భారత అస్తిత్వానికి ప్రతీక
ద్వేషం, అరాచకం, భయభ్రాంతులకు సంబంధించిన నిజాలను దాచిపెట్టి సంపద కోసమే దాడులు జరిగాయని చిత్రీకరించారని విమర్శించారు. తమ మతానికి నిజంగా కట్టుబడినవారు ఇలాంటి అతివాద ఆలోచనలకు మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. అయితే బుజ్జగింపు రాజకీయాలు చేసినవారు మాత్రం అటువంటి అతివాదుల ముందు తలవంచారని ఆరోపించారు. ఒకప్పుడు ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించినవారే నేడు కత్తుల స్థానంలో కుట్రలతో విభజనకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి శక్తులపై జాగ్రత్తగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
వివరాలు
శౌర్యయాత్రలో ప్రత్యేక ఆకర్షణలు
ఆలయాన్ని కాపాడుతూ ప్రాణాలు అర్పించిన యోధుల స్మృతికి నిర్వహించిన శౌర్యయాత్రలోని కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాని వాహనశ్రేణి వెంట 108 అశ్వాలు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో యాత్రలో పాల్గొన్న మోదీ, మధ్యలో డమరుకాన్ని మోగించారు. అనంతరం ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 'హరహర మహాదేవ్' నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.