LOADING...
Telangana: 2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి
2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి

Telangana: 2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ (బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే), కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా సుమారు 2,000మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం అమలుకు ఇప్పటివరకు రూ.607కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోందని వివరించారు. అయితే ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ.. 2025అక్టోబర్‌లో ఉపకార వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదని విమర్శించారు.

వివరాలు

ఎస్సీ వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయి

విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఎదురుచూస్తున్నారని, ఫీజులు చెల్లించలేక, తిరిగి స్వదేశానికి రావడానికీ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా తీసుకుని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. విదేశీ విద్య ఉపకార వేతనాలు ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, కోనేరు రంగారావు సిఫార్సులు అమలు కావడం లేదని విమర్శించారు. అలాగే మాల, మాదిగ వర్గాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఆ దిశగా విధి విధానాలు రూపొందించలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement