కొంతకాలం తర్వాత పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్
కొంతకాలం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) సోమవారం తెలిపారు. ఈ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పీఓకేలో షియా ముస్లింలు చేస్తున్న డిమాండ్లపై దౌసాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "పీఓకే అప్నే ఆప్ భారత్ కే అందర్ ఆయేగా. తోడా థండ్ రఖ్. (పీఓకే భారత్‌లో దానంతట అదే విలీనమవుతుంది. కొంత సమయం వేచి ఉండండి)", అని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అన్నారు. భారత అధ్యక్షతన ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ విజయవంతం కావడం గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు.
అధికార కాంగ్రెస్‌పై విమర్శలు
సమ్మిట్ విజయం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రపంచంలోనే దేశం తన సత్తాను నిరూపించుకుందని అన్నారు. అంతేకాకుండా, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో,శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కారణంగానే బీజేపీ పరివర్తన్ సంకల్ప్ యాత్రను నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా వినాలనుకుంటోందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,వారు ఈ యాత్రకు మాతో పాటు కలసి వస్తున్నారని,మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారని,యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ప్రజా మద్దతు లభిస్తోందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నా ప్రశ్నకు సింగ్ జవాబు ఇస్తూ..ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని, ప్రధాని చరిష్మాతోనే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు.