కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం
సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న శరద్ యాదవ్‌ను చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. సీపీఆర్ ఎంత చేసిన .. ఫలితం లేనప్పటికీ.. గురువారం రాత్రి 10:19 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
శరద్ యాదవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించిన శరద్ యాదవ్
శరద్ యాదవ్ 1947 జులై 1న జన్మించారు. యుక్తవయసులో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. అంచెలంచెలుగా జాతీయ రాజకీయాల్లో ఎదిగారు. 1974లో తొలిసారిగా లోక్‌సభకు శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో పని చేశారు. శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు లోక్ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్య వహించారు. 2003లో శరద్ యాదవ్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2017 ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీతో జేడీయూ పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తును విభేదించిన శరద్ యాదవ్.. జేడీయూను వీడి 2018లో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ)ని ప్రారంభించారు. 2022లో ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.