Page Loader
Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్న కేటీఆర్‌
ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఈడీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్‌

Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్న కేటీఆర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా-ఈ రేస్ కేసులో, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరు కావాల్సి ఉంది. మొదట ఈ నెల 7న హాజరు కావాల్సి ఉన్నా,ఆయన రాలేనని తెలిపిన కారణంగా ఈడీ అధికారులు 16న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో ఇప్పటికే అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించారు.

వివరాలు 

ఈడీ విచారణకు ప్రాధాన్యత

మరోవైపు, తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన పిటిషన్‌ను బుధవారం "డిస్మిస్డ్ యాజ్ విత్‌డ్రాన్"గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యత పెరిగింది. అదే విధంగా, ఏసీబీ కూడా త్వరలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 9న కేటీఆర్‌ను ఏసీబీ విచారించి వాంగ్మూలం నమోదు చేసినప్పటికీ, అవసరమైతే మరోసారి పిలుస్తామని అప్పటికే తెలిపారు. గురువారం ఈడీ విచారణ పూర్తయిన అనంతరం, ఏసీబీ కూడా మళ్లీ విచారణ జరపాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.