Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు మలుపు.. ఏ1గా కేటీఆర్ పేరు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్‌ఈవో (ఫార్ములా-ఈ ఆపరేషన్స్) సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగపత్రంలో నమోదు చేశారు.
వివరాలు
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు రూ.45కోట్లు
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి భారాసకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.45కోట్లు రావడం క్విడ్ ప్రో కోలో భాగమేనని కూడా పేర్కొన్నట్లు సమాచారం. కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గతేడాది నవంబరులో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి 2024డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అదే ఆధారంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. ఈక్రమంలో అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, కేటీఆర్‌లను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఛార్జిషీట్‌లో కేటీఆర్ సహా ఇతరులపై నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
కేసు నేపథ్యం
ఇతరులకు లాభం చేకూరేలా వ్యవహరించారని కూడా ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి 2022 అక్టోబర్ 25న బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవో సంస్థ, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్‌జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఎంఏయూడీ)ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సీజన్ 9 నుంచి 12 వరకు రేసులు నిర్వహించేందుకు ట్రాక్ నిర్మాణం సహా మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ అందించాల్సి ఉంది. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించబడింది. అయితే తరువాత ఏస్ నెక్స్ట్‌జెన్, ఎఫ్‌ఈవో సంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి.
వివరాలు
చెల్లింపులు జరగలేదు
చెల్లింపులు జరగలేదని ఎఫ్‌ఈవో సంస్థ రేసును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అర్వింద్ కుమార్ నేతృత్వంలో 2023 అక్టోబరులో ఎఫ్‌ఈవో, ఎంఏయూడీల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. అదనంగా మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అండర్‌టేకింగ్ తీసుకున్నారు. దీంతో హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి మొత్తం రూ.160 కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం జరిగింది.
వివరాలు
విదేశీ కరెన్సీ రూపంలో రూ.45,71,60,625
ఈ నేపథ్యంలో 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో సీజన్ 10 నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి ఎఫ్‌ఈవోకు రూ.45,71,60,625 విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేశారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని ఐటీ శాఖ గుర్తించి హెచ్‌ఎండీఏకు రూ.8.07 కోట్ల జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణలో హెచ్‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54,88,87,043 దుర్వినియోగమైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను రెండుసార్లు విచారించారు. అలాగే ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నించారు.