Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే, దేశ రక్షణ రంగంలో గర్వకారణంగా నిలిచే కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి చెందబోతోందని పేర్కొన్నారు. రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
వివరాలు
2,500 మందికి ఉపాధి అవకాశాలు..
పుట్టపర్తి పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందేశాలను వ్యాప్తి చేసిన సత్యసాయి బాబా గుర్తుకు వస్తారని సీఎం అన్నారు. ఆయన శాంతి, మానవతా విలువల కోసం చేసిన సేవలను చంద్రబాబు స్మరించారు. భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే, కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ద్వారా దేశంలోనే అత్యాధునిక డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.686 కోట్ల పెట్టుబడితో ఎనిమిది సంస్థలు ఏర్పాటు కానుండగా, వాటి ద్వారా సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
వివరాలు
రాయలసీమలో విస్తృత మార్పులు..
గతంలో రాయలసీమ సంపదతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, కానీ కాలక్రమేణా అనంతపురం ఎడారిలా మారిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి పునాది వేసిన ఘనత రామారావుదేనని కొనియాడారు. సీమ ప్రాంతానికి సాగునీరు అందించి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచాలని ఎన్టీఆర్ సంకల్పించారని, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని వెల్లడించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణతో రాయలసీమకు జలసౌభాగ్యం అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమలో విస్తృత మార్పులు చోటుచేసుకోనున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని మళ్లీ సంపదతో నిండిన రతనాలసీమగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వివరాలు
బంగారు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఏపీ..
అలాగే కడప స్టీల్ ప్లాంట్ పనులను జూన్ నెలలో ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషించే రాష్ట్రంగా ఎదుగుతోందని చంద్రబాబు అన్నారు. గతంలో బంగారం అంటే కేజీఎఫ్ గుర్తుకొచ్చేదని, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ దేశ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అక్కడ 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నామని, వచ్చే ఏడాది అది 1,500 కిలోలకు పెరుగుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా అవతరించబోతోందని సీఎం స్పష్టం చేశారు.