Cyber Crime: గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్రమైన ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. దీన్ని అవకాశవాద సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుతున్నారు. గ్యాస్ బుకింగ్ కోసంఆన్‌లైన్‌లో వెతికే అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలను అమలు చేస్తున్నారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు పెట్టి ప్రజలను బురిడీ కొట్టుతున్నారు. ఈపరిస్థితిపై అప్రమత్తంగా ఉండమని విసి సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాట్సప్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింక్‌లను పంపి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారని తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని గ్యారెంటీగా వచ్చే సందేశాలను ప్రజలు సైబర్ మోసంగా గుర్తించాలన్నారు.
Details
ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరాదు
ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని, సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం కేవలం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరాదని హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లలో వ్యక్తిగత, ఆర్థిక వివరాలు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతికి మీ బ్యాంక్ ఖాతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వీటిల్లో ఏదైనా మోసానికి గురైన వ్యక్తులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని, లేదా[http://cybercrime.gov.in](http://cybercrime.gov.in) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.