LOADING...
Andhra pradesh: రేపటి నుండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం
రేపటి నుండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం

Andhra pradesh: రేపటి నుండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకానికి ప్రభుత్వం 'దివ్యాంగ శక్తి' అనే పేరు పెట్టింది. గుంటూరు బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయంపై సోమవారం ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్,సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇకపై ఈ బస్సుల్లో దివ్యాంగులకూ ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సర్వీసుల్లో దివ్యాంగులు 50 శాతం రాయితీతో ప్రయాణించేవారు. ఇకపై వారికి జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు.

వివరాలు 

నేటి నుంచి పాస్‌ల జారీ

అయితే నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్లుగానే 50 శాతం రాయితీతో ప్రయాణించే సదుపాయం కొనసాగుతుంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాస్‌ల జారీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 50 శాతం రాయితీ పాస్ ఉన్నవారు అదే పాస్‌తో ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆ పాస్ గడువు ముగిసే వరకు అది చెల్లుబాటు అవుతుందని అధికారులు తెలిపారు. కొత్తగా పాస్ తీసుకోవాలనుకునేవారు సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు తీసుకుని బస్ పాస్ కౌంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

వివరాలు 

నేటి నుంచి పాస్‌ల జారీ

మొబైల్ యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందే అవకాశం కల్పించారు. ఏపీఎస్ ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో సదరం ఐడీ నంబర్ నమోదు చేస్తే సంబంధిత వివరాలు ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి. అనంతరం నామమాత్రపు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ పాస్ జారీ అవుతుంది. ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా అందుబాటులో ఉన్న 'మనమిత్ర' యాప్ ద్వారా కూడా డిజిటల్ బస్ పాస్ పొందవచ్చు. డిజిటల్ పాస్ పొందిన దివ్యాంగులు ప్రయాణ సమయంలో మొబైల్‌లో ఉన్న పాస్‌తో పాటు అసలు సదరం ధ్రువపత్రాన్ని కండక్టర్‌కు చూపాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

అర్హతలు, ఎస్కార్ట్ సదుపాయం

40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 'దివ్యాంగ శక్తి' పథకం కింద పాస్‌లు జారీ చేస్తారు. పూర్తిగా చూపు లేని వారు (100 శాతం అంధత్వం) లేదా 69 శాతానికి పైగా శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారికి ఎస్కార్ట్ అనుమతి ఉంటుంది. ఎస్కార్ట్‌కు అన్ని సంబంధిత బస్సుల్లో టికెట్ ఛార్జీపై 50 శాతం రాయితీ అందుతుంది. త్వరితగతిన అమలు గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలపడంతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వేగంగా పూర్తి చేశారు.

Advertisement