Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం: సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే రోజు జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-విశ్వవిద్యాలయం, జీఎంఆర్-మన్సాస్ ఎడ్యూ సిటీలను కూడా ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు. విమానాశ్రయం నిర్మాణానికి భూములు అందించిన రైతులు, భూయజమానులను ప్రత్యేకంగా గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించే అవకాశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వివరాలు
థింసా, సవర, కొమ్ముకోయ తదితర జానపద నృత్యాలతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం సూచించారు.
సోమవారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
ఈ విమానాశ్రయం భవిష్యత్తులో లాజిస్టిక్స్ కేంద్రంగా రూపుదిద్దుకుని ప్రపంచ స్థాయి అనుసంధానాన్ని అందించడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే థింసా, సవర, కొమ్ముకోయ తదితర జానపద నృత్యాలతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకాలన్నారు.
సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు.
వివరాలు
ఉత్తరాంధ్ర అంతటా వేడుకల వాతావరణం
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ స్ఫూర్తి ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటికి చేరేలా వచ్చే పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
మంగళవారం నుంచి జరిగే కార్యక్రమాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్న అరకు కాఫీకి మరింత గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రారంభోత్సవాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముండటంతో ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు సమర్థంగా చేయాలని అధికారులను ఆదేశించారు.
సభకు వచ్చే ప్రజలకు అల్పాహారం, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.
వివరాలు
భోగాపురంలో ముమ్మర ఏర్పాట్లు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌తో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రారంభోత్సవానికి వీఐపీలు, వీవీఐపీలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
వివరాలు
భోగాపురంలో ముమ్మర ఏర్పాట్లు
ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఉత్తరాంధ్ర కళా వైభవాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమీక్షలో నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు.
ఇక విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేసేందుకు తొలి దశలో ప్రభుత్వం 20 విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులను కేటాయించింది.
ఇప్పటికే నాలుగు బస్సులు విజయనగరం జిల్లాకు చేరుకున్నాయని ఆర్టీసీ విజయనగరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయగీత తెలిపారు.