Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు పథకాలు అమల్లో ఉన్నాయి. తాజాగా, ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో హామీపై ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ స్కీమ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీపావళి నాటికి వీలైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని వెల్లడించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి, అభివృద్ధి పనులను స్ట్రీమ్‌లైన్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు కూటమిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయాలని సూచించారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసం నిలబెట్టుకోవాలని, కక్ష సాధింపుల దారిలో వెళ్ళకూడదని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు చేస్తే 48గంటల్లోనే డబ్బులు
ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య సమన్వయం అద్భుతంగా ఉండటమే కాకుండా,వంద రోజుల్లో కూడా అదే రీతిలో పని చేయగలిగామని ప్రశంసించారు. అభివృద్ధి కోసం నరేగా నిధులు ఉపయోగించుకోవచ్చని,ధాన్యం కొనుగోలు చేస్తే 48గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయిన సమయంలో సమర్థవంతంగా మరమ్మతులు చేయగలిగామని చంద్రబాబు గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ఇష్యూ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామని, ప్రాజెక్టును కాపాడటం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాజధాని రైతులకు కౌలు ఇస్తామని,ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు ఎవరికి కూడా కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2047 మిషన్‌లో 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.