మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస; 9మంది మృతి
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజా ఘర్షణలో తొమ్మిది మంది మరణించారు. ఖమెన్‌లోక్ గ్రామంలో అనేక ఇళ్లను దుండగులు తగులబెట్టారు. అలాగే ఈ ఘర్షణలో మరో 10మంది గాయపడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లా, కాంగ్‌పోకి జిల్లా సరిహద్దులో ఉన్న ఖమెలోక్ ప్రాంతంలోని గ్రామస్తులను బుధవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో అధునాతన ఆయుధాలతో చుట్టుముట్టిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో హింసకు అడ్డుకట్టే వేసేందుకు ప్రభుత్వం పటిష్టచర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.