Loading...
AP-Germany: ఆంధ్రావని టు జర్మనీ.. ఏపీ యువతకు విదేశాల్లో కొలువులు!
ఆంధ్రావని టు జర్మనీ.. ఏపీ యువతకు విదేశాల్లో కొలువులు!

AP-Germany: ఆంధ్రావని టు జర్మనీ.. ఏపీ యువతకు విదేశాల్లో కొలువులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్థాయిలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ముందుకు సాగుతోంది. రాష్ట్ర యువతకు వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణతో పాటు విదేశీ భాషల్లోనూ శిక్షణ అందించి.. ఆయా దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఓంక్యాప్‌) ఆధ్వర్యంలో జర్మనీ, జపాన్‌, కువైట్‌ తదితర దేశాలకు యువతను పంపిస్తూ.. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, కడప సహా ఆరు ప్రాంతాల్లో యువతకు ఆయా దేశాల సంస్కృతి, చట్టాలు, కార్మికుల హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని 13 నర్సింగ్‌ కళాశాలల్లో జర్మన్‌ భాషను కరిక్యులంలో భాగంగా బోధిస్తున్నారు.

వివరాలు

జర్మనీ భాషలో ప్రత్యేక శిక్షణ

ఏ1, ఏ2, బి1, బి2 స్థాయుల్లో జర్మన్‌ భాషలో శిక్షణ అందిస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్న 48 మందికి జర్మన్‌ భాషపై శిక్షణ అందించగా.. వారిలో 45 మంది జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

వీరికి శుక్రవారం బి2 స్థాయి శిక్షణ పూర్తి చేసినట్లు ధ్రువీకరణ పత్రాలతో పాటు జాబ్‌ ఆఫర్‌ లెటర్లను అధికారులు అందించారు.

వీరు బ్యాచ్‌ల వారీగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి జర్మనీ వెళ్లనున్నారు. మరోవైపు రాజమహేంద్రవరంలో 30 మందికి ఈ నెల 23 నుంచి జపనీస్‌ భాషలో శిక్షణ ప్రారంభించనున్నారు.

వివరాలు

విభిన్న ప్రాజెక్టులతో కెరీర్‌ మార్గాలు

ప్రాజెక్టు వసుధ

నర్సింగ్‌ గ్రాడ్యుయేట్లకు జర్మన్‌ భాషలో బి2 స్థాయి వరకు ఉచిత శిక్షణ అందిస్తోంది. అనంతరం జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలు పొందేలా అవకాశాలు కల్పిస్తోంది.

సర్వసేతు

ఐటీఐ విద్యార్థులకు జర్మన్‌ భాషలో ఏ1, ఏ2 స్థాయుల్లో ప్రాథమిక శిక్షణ అందిస్తోంది. తద్వారా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది.

బ్లూ డైమండ్‌

శ్రీకాకుళంలోని శిక్షణ కేంద్రం ద్వారా గల్ఫ్‌, యూరప్‌ దేశాల్లో ఏటా 1,200 మందికి వెల్డర్లుగా ఉద్యోగాలు కల్పించేలా కార్యక్రమం చేపడుతోంది.

ADVERTISEMENT

వివరాలు

నర్సింగ్‌లో అవకాశాలు మెండు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓంక్యాప్‌ సహకారంతో రాష్ట్రానికి చెందిన 1,817 మంది విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లారు.

మరో 235 మంది త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి బాగోగులను ఏపీఎన్‌ఆర్టీ పర్యవేక్షిస్తోంది.

జర్మనీలో నర్సులుగా పనిచేస్తున్న యువతులకు నెలకు 3,000 నుంచి 4,000 యూరోల వరకు వేతనం లభిస్తోంది.

ప్రస్తుతం ఒక యూరో విలువ రూ.109గా ఉంది. వీరి విమాన ప్రయాణ ఖర్చులను కూడా ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలే భరిస్తున్నాయి.

రాజమహేంద్రవరంలోని శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కొందరు యువత జర్మన్‌ భాషలో బి1 స్థాయిలోనే ఉద్యోగాలు సాధించారు.

వీరికి జర్మనీలో వసతి సదుపాయంతో పాటు ప్రారంభంలోనే నెలకు 1,200 యూరోల ఉపకారవేతనం అందనుంది.

ADVERTISEMENT

వివరాలు

డ్రైవింగ్‌, హోంకేర్‌, వెల్డింగ్‌లోనూ అవకాశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో చదువుతున్న 2,335 మంది విద్యార్థులకు జర్మన్‌ భాషలో శిక్షణ అందిస్తున్నారు.

యూఏఈలో డ్రైవర్‌ ఉద్యోగాల కోసం తొమ్మిది మంది ఎంపికయ్యారు. వీరికి అక్కడ ఆరు నెలల పాటు ఉచిత వసతి కల్పించడంతో పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

అనంతరం లైసెన్స్‌ అందించి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు.

కువైట్‌కు ఇప్పటికే 26 మంది డ్రైవర్లను పంపించగా.. మరో 89 మంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖతార్‌లో హోం కేర్‌ నర్సులు, వెల్డర్లుగా 29 మంది ఎంపికయ్యారు.

ADVERTISEMENT