Concrete Bunkers: గుహలు వదిలి బంకర్ల బాట.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లోని గుహలను ఆశ్రయంగా ఉపయోగించుకున్న ఉగ్రవాదులు.. ఇప్పుడు అండర్‌గ్రౌండ్ బంకర్లు, కాంక్రీట్ నిర్మాణాలను తమ హైడవుట్లుగా మార్చుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉగ్రవాదులు తమ దాగుడు స్థావరాల విషయంలో పూర్తిగా వ్యూహం మార్చుకున్నారు. గతంలో గుహలను ఆశ్రయించిన వారు.. ఇప్పుడు భూమిని తవ్వి, దుంగలు తదితర సామగ్రితో తాత్కాలిక అండర్‌గ్రౌండ్ బంకర్లను నిర్మించుకుంటున్నారు. గతేడాది కశ్మీర్ లోయలోని కుల్గామ్ అడవుల్లో నిర్వహించిన సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్‌లో ఇలాంటి బంకర్లను భద్రతా బలగాలు గుర్తించాయి.
వివరాలు
12 వేల అడుగుల ఎత్తులో మరో బంకర్
అంతేకాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో చత్రు ప్రాంతంలో సుమారు 12 వేల అడుగుల ఎత్తులో మరో బంకర్ బయటపడింది. ఒకేసారి నలుగురు ఉండేలా నిర్మించిన ఈ బంకర్‌లో పలుమాసాలకు సరిపడా నిత్యావసర వస్తువులను నిల్వ చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు తాత్కాలిక బంకర్లకే పరిమితం కాకుండా, దట్టమైన అడవుల్లో ఎక్కువకాలం మన్నిక ఉండే కాంక్రీట్ బంకర్లను కూడా నిర్మిస్తున్నారు. ఎక్కువ రోజులు అజ్ఞాతంలో ఉండేందుకు, స్థానికుల సహాయంపై ఆధారపడకుండా తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
ఆపరేషన్ షెరువాలీ
ఉగ్రవాదులు రాజౌరీ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారనే నిఘా సమాచారంతో మే 22 నుంచి సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా "ఆపరేషన్ షెరువాలీ" చేపట్టారు. ఈ గాలింపు చర్యల సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. రాజౌరీలోని గంబీర్ ముగ్లన్, డొరిమల్ ప్రాంతాల్లోని హైడవుట్లలో ఉగ్రవాదులు దాక్కుని ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఓ కాంక్రీట్ బంకర్‌ను గుర్తించి పేల్చివేశారు. అదే ప్రాంతంలో మరిన్ని బంకర్లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు, విస్తృత స్థాయిలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.