LOADING...
Year Ender 2025 : ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025 
ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025

Year Ender 2025 : ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేసీఆర్, బీఆర్ఎస్... ఈ మూడు అక్షరాలు తెలంగాణ రాజకీయ దిశనే మార్చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కొత్త రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగడం వరకు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎదురులేని రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ఎదిగిన తీరు దేశమంతా చూసిన వాస్తవమే. అయితే 2025 సంవత్సరం మాత్రం కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు కలిసిరాలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులు, పార్టీ అంతర్గత సమస్యలు, ఆరోగ్య సమస్యలు కేసీఆర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆశించిన స్థాయిలో ఆయన ప్రభావం కనిపించలేదనే విమర్శలు ఉన్నాయి.

Details

ఎమ్మెల్యేలు జంప్… రెబల్‌గా మారిన కూతురు

పార్టీలో అసంతృప్తులు, ఎమ్మెల్యేల జంప్‌లు కేసీఆర్‌కు పెద్ద సవాలుగా మారాయి. అంతేకాదు, కుమార్తె కవిత పార్టీకి, కుటుంబానికి దూరంగా వెళ్లడం గులాబీ శిబిరానికి షాక్ ఇచ్చిన పరిణామంగా నిలిచింది. 2025 సంవత్సరం కేసీఆర్ రాజకీయ జీవితంలో కష్టకాలంగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఈ ఏడాదిలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఆ కేసుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదన్న టాక్ బయట నడుస్తోంది. ఇదే సమయంలో మరో వైపు వేరు కుంపటి పెట్టడానికి సిద్ధమవుతున్న కవిత, కేసీఆర్‌కు కంట్లో నలుసులా మారారు.

Details

ఆందోళన కలిగిస్తున్న ఆరోగ్యం

పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్‌గా మారిన ఆమె, పదేళ్ల పాలనపై విచారణ చేయిస్తానంటూ హెచ్చరించడం ద్వారా కన్న తండ్రికే ఊహించని షాక్ ఇచ్చారు. కవిత టార్గెట్ వేరైనా, దెబ్బ తగిలింది మాత్రం కేసీఆర్‌కేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ఆయన, అవసరమైనప్పుడు మాత్రమే వైద్య పరీక్షల కోసం బయటకు వస్తున్నారనే సమాచారం ఉంది. ఫామ్‌హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

Details

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

బాధ్యతలన్నీ కేటీఆర్‌కు అప్పగించి కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసినా, మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు, కేసుల హెచ్చరికలు చేయడం టెన్షన్‌కు కారణమవుతోంది. అలాగే ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వ ధనం వృథా చేశారన్న ఆరోపణలు, అక్రమాలు, కమిషన్ల అంశాలు కేటీఆర్‌ను చుట్టుముట్టాయి. ఈ పరిణామాలే కేసీఆర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయన్న గుసగుసలు గులాబీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Advertisement

Details

 అసెంబ్లీకి వచ్చి… వెళ్లిపోతున్న తీరు

2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజున ఒక్కసారే అసెంబ్లీకి హాజరయ్యారు కేసీఆర్. అప్పుడూ చాలా తక్కువ సమయం మాత్రమే సభలో కనిపించారు. ఆ తర్వాత అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. తాజాగా జరిగిన శీతాకాల సమావేశాల తొలి రోజున మాత్రం ఆయన సభకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చి నమస్కారం చేయడం వైరల్‌గా మారింది.

Details

ఒక్క పబ్లిక్ మీటింగ్… ఒక్క ప్రెస్ మీట్

జల వివాదాల నేపథ్యంలో నల్లగొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఫిబ్రవరి మధ్యలో జరిగిన ఈ సభ తర్వాత ఆయన మళ్లీ ప్రజల్లో కనిపించలేదు. మరోవైపు తన మాటలతో ప్రత్యర్థులను తీవ్రంగా విమర్శించే కేసీఆర్ నైజం తెలిసిందే. రెండేళ్ల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో 'కేసీఆర్ ఈజ్ బ్యాక్' అన్న యాంగిల్ కొంత హైప్ తెచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఆయన సైలెంట్ అయి, పార్టీ శ్రేణులను నిరాశపరిచారు.

Details

జూబ్లీహిల్స్ బైపోల్… పంచాయతీ ఎన్నికలు

ఈ ఏడాది బీఆర్ఎస్ రెండు కీలక ఎన్నికలను ఎదుర్కొంది. మాగుంట గోపినాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఎంత ప్రయత్నించినా ఆ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడంలో పార్టీ విఫలమైంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంతవరకు పరువు నిలబెట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే, కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు 2025 సంవత్సరం రాజకీయంగా భంగపాటనే మిగిల్చిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

Advertisement