LOADING...
Republic Day Parade 2026: 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు 10 వేల మంది ప్రత్యేక అతిథులు
77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు 10 వేల మంది ప్రత్యేక అతిథులు

Republic Day Parade 2026: 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు 10 వేల మంది ప్రత్యేక అతిథులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 26న న్యూదిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు కనీసం 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. వివిధ రంగాలు, వృత్తులు, వర్గాలకు చెందిన ఈ అతిథులను వారి జీవిత భాగస్వాములతో కలిసి ఆహ్వానించినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో ఆదాయం, ఉపాధి సృష్టిలో విశేష సేవలు చేసిన వారు, ఉత్తమ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్‌ల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అలాగే కీలక ప్రభుత్వ పథకాల కింద అత్యుత్తమంగా పనిచేసిన వారు ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వివరాలు 

కర్తవ్య పథ్‌లో ప్రత్యేక అతిథులకు కూర్చునే ఏర్పాట్లు

దేశ నిర్మాణంలో వారి పాత్రను గౌరవించడమే కాకుండా, జాతీయ ప్రాముఖ్యత గల కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారి) పెంచాలనే లక్ష్యంతో ఈ ఆహ్వానాలు పంపినట్లు తెలిపింది. ప్రత్యేక అతిథులకు కర్తవ్య పథ్‌లో ప్రత్యేకంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు. వేడుకలతో పాటు నేషనల్ వార్ మెమోరియల్, పీఎం సంగ్రహాలయం తదితర ప్రముఖ ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత కేంద్ర మంత్రులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా కల్పించనున్నారు.

వివరాలు 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భద్రతా వ్యవస్థ

ఇదిలా ఉండగా, గణతంత్ర దినోత్సవానికి ముందే ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి వచ్చిన ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో కర్తవ్య పథ్‌తో పాటు మొత్తం న్యూఢిల్లీ జిల్లాలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం సీటింగ్ ప్రాంతాలను మరింత విస్తరించి, భారత నదుల పేర్లతో వాటికి నామకరణం చేశారు. అతిథుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా మోహరింపు విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

వివరాలు 

కేంద్ర మంత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం

ఆహ్వాన పత్రాలు పొందిన అతిథులు, టికెట్ హోల్డర్లు కార్డులపై ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవాలని పోలీసులు కోరారు. రూట్లు, పార్కింగ్, ఎన్‌క్లోజర్లకు సంబంధించిన పూర్తి వివరాలు రక్షణ మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక అతిథులు ఢిల్లీ పర్యటనలో నేషనల్ వార్ మెమోరియల్, పీఎం సంగ్రహాలయం సహా ఇతర ముఖ్య ప్రాంతాలను సందర్శిస్తారని, ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisement