LOADING...
Assembly Elections : పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకు.. రసవత్తరంగా రాజకీయ పోరు
పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకు.. రసవత్తరంగా రాజకీయ పోరు

Assembly Elections : పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకు.. రసవత్తరంగా రాజకీయ పోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మార్పుకే కాకుండా, కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక మార్పులకు దారితీయనున్నాయి. ప్రాంతీయ పార్టీలకు బలమైన పట్టు ఉన్న ఈ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాలు

బెంగాల్‌లో 'దీదీ vs మోదీ' పోరు

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల సమరం మళ్లీ మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీగా మారింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకోగా ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. మమతా బెనర్జీ తన 15 ఏళ్ల సంక్షేమ పథకాలు, బెంగాలీ అస్తిత్వాన్ని నమ్ముకుంటుండగా, బీజేపీ అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలను ప్రధాన అస్త్రాలుగా వినియోగిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఎల్‌పీజీ కొరత బీజేపీకి ప్రతికూలాంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.

వివరాలు

తమిళనాడులో త్రిముఖ పోటీ

తమిళనాడులో ఈసారి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటములకు తోడు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రంగప్రవేశం చేసింది. ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించాలని చూస్తుండగా, ఎఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి గట్టి పోటీ ఇస్తున్నారు. విజయ్ ఒంటరిగా పోటీకి దిగడం వల్ల ఓటు విభజనపై ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

Advertisement

వివరాలు

కేరళలో హ్యాట్రిక్ లక్ష్యం

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఈసారి గెలుపుపై ధీమాగా ఉంది. బీజేపీ కూడా బలమైన మూడో శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. అసోంలో 'డబుల్ ఇంజన్' పోటీ అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలో బీజేపీ 'డబుల్ ఇంజన్ సర్కార్' నినాదంతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ తరఫున యువనేత గౌరవ్ గోగోయ్ గట్టి సవాల్ విసురుతున్నారు.

Advertisement

వివరాలు

పుదుచ్చేరిలో కూటముల పోరు

పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకుంది. ఫలితాలపై ఉత్కంఠ మొత్తం ఐదు రాష్ట్రాల ఓటర్ల తీర్పు మే 4న వెల్లడికానుంది. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతుందా? లేక జాతీయ పార్టీలు తమ ప్రభావాన్ని మరింత బలపరుస్తాయా? అన్నది అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Advertisement