LOADING...
Hardeep Singh Puri: పెట్రోల్‌,డీజిల్ ధరలు పెరుగుతాయా?.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు
పెట్రోల్‌,డీజిల్ ధరలు పెరుగుతాయా?.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు

Hardeep Singh Puri: పెట్రోల్‌,డీజిల్ ధరలు పెరుగుతాయా?.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. అయితే గత నాలుగేళ్లుగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్ ధరలు పెంచలేదని చెప్పిన ఆయన.. ఇకపై కూడా పెరగవని మాత్రం చెప్పలేమంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. మే 12న నిర్వహించిన 'సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు-2026'లో ఆయన ఇంధన నిల్వలు, ధరల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వం ఎల్పీజీ ఉత్పత్తిని గతంలో రోజుకు సుమారు 35వేల టన్నుల నుంచి 54వేల టన్నులకు పెంచిందన్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు,పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా భవిష్యత్తులో ధరల పెంపు అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని సంకేతాలిచ్చారు.

వివరాలు  

ఎన్నికలకు, ఇంధన ధరల నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు 

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే ధరల సవరణను ప్రభుత్వం వాయిదా వేసిందన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఎన్నికలకు, ఇంధన ధరల నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత నెలకొన్నప్పటికీ.. భారతదేశంలో గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 50 నుంచి 60 శాతం వరకు పెరిగాయని, అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొందన్నారు. అయినప్పటికీ ధరలు భవిష్యత్తులో పెరగవని తాను హామీ ఇవ్వలేనని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలు పెట్రోల్‌, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని సూచించడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే 60 రోజుల అవసరాలకు సరిపడా lpg, 45 రోజుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగొచ్చన్న సంకేతాలు ఇస్తూనే.. ప్రస్తుతం ప్రభుత్వ చమురు విక్రయ సంస్థలు రోజుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయని ఆయన చెప్పారు. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ఆయా సంస్థలే ఈ నష్టాన్ని మోస్తున్నాయని వివరించారు.

Advertisement

వివరాలు 

దేశీయంగా చమురు ఉత్పత్తి పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి

గతేడాది వచ్చిన లాభాలు కూడా ప్రస్తుత పరిస్థితుల కారణంగా దాదాపు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. 'సముద్ర మంథన్' పథకం ద్వారా చమురు అన్వేషణ, ఉత్పత్తి పెంపునకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ రంగానికి అవసరమైన నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీసం 90రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉండాల్సిన అవసరం ఉందని, ఆ లక్ష్యంతో దేశంలో అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నామని మంత్రి వివరించారు.

Advertisement

వివరాలు 

మూడో నెలలోకి అమెరికా-ఇరాన్ యుద్ధం

ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మూడో నెలలోకి ప్రవేశించింది. శాంతి చర్చల్లో భాగంగా ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement