LOADING...
Fuel prices: ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం
ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం

Fuel prices: ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, చమురు ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం,సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ గురువారం ఈ విషయంపై స్పందించారు. ఇటీవల ఇంధన ధరలను లీటరుకు సుమారు రూ.3.94 మేర మాత్రమే పెంచామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయని చెప్పి ఆ పెంపును వెంటనే వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదన్నారు.

వివరాలు 

ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం

హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకలు భారీగా ఉన్నాయని సురేశ్ గోపీ చెప్పారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్‌కు చేరుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వివరించారు. రవాణా, సరఫరా వ్యవస్థలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపిస్తుందన్నారు. ఈ కారణాలతో పాటు మరికొన్ని ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని చమురు కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని మంత్రి తెలిపారు.

వివరాలు 

కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం

ఆ సమయంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు ఊరట కల్పించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదన్నారు. దీంతో ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వంపైనే పడిందని పేర్కొన్నారు. ఇంధన ధరలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సురేశ్ గోపీ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు సరఫరా, రవాణా వ్యయాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఇంధన ధరలపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement