
Telangana: ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్.. వెయ్యిలోపు ర్యాంకర్లకూ వర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు,జిల్లా పరిషత్ పాఠశాలలు,గురుకులాలు,జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే... వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తారు. దీనితో పాటు,పాలిసెట్ పరీక్షలో వెయ్యిలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకూ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ఎంత ఫీజు ఉన్నా సర్కారు మొత్తం చెల్లించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంబంధించి సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ అధికారిక ఉత్తర్వులు(జీఓ)జారీ చేశారు. ఈ నిర్ణయంతో గత 10 రోజులుగా నిలిచిపోయిన పాలిసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియకు ముందడుగు పడింది. మంగళవారం అభ్యర్థులకు తొలి విడతగా సీట్లు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ర్యాంక్ ఎలా ఉన్నా పూర్తిస్థాయిలో బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది.
వివరాలు
ప్రభుత్వ జీఓతో సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం
మిగతా విద్యార్థులకు గరిష్ఠంగా రూ.14,900 వరకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. గతంలో పాలిటెక్నిక్ కోర్సు ఫీజు గరిష్ఠంగా రూ.14,900 ఉండేది. అయితే తాజాగా ప్రభుత్వం ఆ ఫీజును రూ.39,000కి పెంచింది. ఈ నేపథ్యంలో రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో పాలిసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నాటికి పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో మంగళవారం సీట్ల కేటాయింపు ప్రారంభమైంది.
వివరాలు
18,984 మందికి సీట్లు కేటాయింపు
మొత్తం 18,984 మందికి సీట్లు కేటాయించామని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. రెండో విడత కౌన్సెలింగ్ పూర్తైన తర్వాతే విద్యార్థులు స్వయంగా తమ కళాశాలలకు హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ఒక ప్రైవేట్ కళాశాలలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 10,012 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్లు వివరించారు.