Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న హైడ్రాను, త్వరలోనే హెచ్‌ఎండీఏ వరకు విస్తరించనున్నారు. హైడ్రా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను సెంట్రల్ జోన్‌గా, సైబరాబాద్‌ను నార్త్ జోన్‌గా, రాచకొండను సౌత్ జోన్‌గా విభజించాలని నిర్ణయించారు.
ప్రతి జోన్ కు ఎస్పీ స్థాయి అధికారుల నియామకం
ప్రతి జోన్‌కి ఎస్పీ స్థాయి అధికారులు నియమించి, ఈ మూడు జోన్లకు చీఫ్ కమిషనర్ పర్యవేక్షలో ఉండనున్నాయి. ఇటీవల బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభ ప్రొరోగ్ కావడంతో, ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది. హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇది దేశంలో నాలుగో ప్రత్యేక పోలీసు వ్యవస్థగా నిలవనుంది.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురానుంది. భవన అనుమతులు ఇచ్చే సమయంలో 10శాతం స్థలాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తాకట్టు పెట్టాలి. నిబంధనలను అతిక్రమిస్తే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడానికి చట్టంలో మార్పులు చేయనున్నారు.