LOADING...
Future City FCDA Office: ప్రారంభానికి ముందే ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే
ప్రారంభానికి ముందే ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే

Future City FCDA Office: ప్రారంభానికి ముందే ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రారంభానికి ముందే భారత్ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌సీడీఏ)కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. పర్యావరణ హిత నిర్మాణ ప్రమాణాలను పాటించిన ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) 'నెట్ జీరో గ్రీన్ బిల్డింగ్'గా గుర్తింపు ఇచ్చింది. నిర్మాణంలో పర్యావరణానికి హాని కలిగించని పదార్థాల వినియోగం,వర్షపు నీటి సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలు,సౌర విద్యుత్ వినియోగం వంటి అంశాలను పరిశీలించిన ఐజీబీసీ ప్రతినిధులు ఈ గుర్తింపును ప్రకటించారు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం,భిన్న రంగాలకు చెందిన క్లస్టర్ల అభివృద్ధికి కేంద్రంగా మారనున్న ఎఫ్‌సీడీఏ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని బుధవారం అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

వివరాలు 

పర్యావరణ హిత ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణ

ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో ఆధునిక పర్యావరణ పరిరక్షణ సదుపాయాలను కల్పించారు. భవనంలో 15 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అధికారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు విద్యుత్ వాహనాల్లో వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా, కార్యాలయ పరిసరాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల తయారీ కోసం బయో డైజెస్టర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం కల్పించారు.

వివరాలు 

ఉద్యోగుల కోసం అత్యాధునిక వర్క్‌స్టేషన్ల ఏర్పాటు

ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి, వైస్ ఛైర్మన్ హోదాలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రత్యేక ఛాంబర్లను నిర్మించారు. అలాగే, ఆధునిక ఐటీ కంపెనీల తరహాలో ఉద్యోగుల కోసం అత్యాధునిక వర్క్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం ఈ కార్యాలయ ప్రత్యేకతగా నిలుస్తోంది.

Advertisement