ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం
జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటి అనే అంశాన్ని మరింత బలపర్చేందుకు 6,000ఏళ్ల ప్రజాస్వామ్య భారతీయ చరిత్రను ఈ బుక్‌లెట్స్‌లో కేంద్రం పొందుపర్చింది. ఈ బుక్‌లెట్స్‌ను జీ20 అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రజాస్వామ్య తత్వం సహస్రాబ్దాలుగా దేశంలో భాగంగా ఉందని ఆ బుక్‌లెట్స్ చెబుతున్నాయి. రాముడు, ఛత్రపతి శివాజీ, అశోక చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏలుబడిని ప్రజాస్వామ్య పాలనగా ఆ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. మొఘలుల పాలనను తరుచూ వ్యతిరేకించే బీజేపీ అక్బర్ పరిపాలనను ప్రజాస్వామ్యమైనదంటూ కీర్తించడం ఆసక్తికరంగా ఉంది.
అక్బర్ అవగాహన కలిగిన చక్రవర్తి
రెండు బుక్‌లెట్లలోని 40 పేజీల్లో రామాయణం, మహాభారతం, ఛత్రపరి శివాజీ, అక్బర్, సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశం అధికార మార్పిడి అంశాల గురించి కేంద్రం చెప్పుకొచ్చింది. అక్బర్‌ను అవగాహన కలిగిన చక్రవర్తిగా బుక్‌లెట్‌లో కేంద్రం పేర్కొనడం గమనార్హం. అక్బర్ మత వివక్షకు వ్యతిరేకంగా 'సుల్-ఇ-కుల్' అనే సార్వత్రిక శాంతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం చెప్పింది. దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు రానున్నారు. ఈ రెండు బుక్‌లెట్‌లను జీ20 సమావేశాలకు వచ్చే ప్రముఖులకు అందజేయనున్నారు.
ప్రజలు ఎన్నుకున్న మొదటి పాలకుడు రాముడు
రామాయణం, మహాభారతాల కాలంలో కూడా ప్రజాస్వామ్య అంశాలను ఈ బుక్‌లెట్ ఉదహరించింది. 'ప్రాచీన అయోధ్య రాజ్యానికి కొత్త రాజు అవసరమైనప్పుడు, దశరథుడు తన మంత్రిమండలి, ప్రజాప్రతినిధుల ఆమోదం కోరారు. ప్రజాప్రతినిధులు సమాజంలోని అన్ని వర్గాలతో సమగ్ర సంప్రదింపులు జరపగా అందరూ రాముడిని ఏకగ్రీవంగా రాజుగా అంగీకరించారు. దీంతో దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన మొదటి పాలకుడు రాముడు' అంటూ కేంద్రం రూపొందంచిన బుక్‌లెట్ చెబుతోంది. మహాభారతంలో భీష్ముడు తన మనవడు యుధిష్ఠిరునికి సుపరిపాలన సూత్రాలను చెప్పాడని పేర్కొంది. పాలకుడు ఎలా ఉండాలి అనేది వందల ఏళ్ల క్రితమే భీష్ముడు చెప్పాడని ఆ బుక్‌లెట్‌లో పొందుపర్చారు.
అశోకుడి కాలంలోనే ఐదేళ్లకు ఒకసారి మంత్రులను ఎన్నుకునే పద్ధతి
265-238 BCEలోనే అశోక చక్రవర్తి ప్రతి ఐదేళ్లకు ఒకసారి మంత్రులను ఎనుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన బుక్‌లెట్లు వర్ణించాయి. శాంతి, సంక్షేమం, సార్వత్రిక సౌభ్రాతృత్వం అనే అశోకుడి సిద్ధాంతాలు నేటికీ భారత ఉపఖండం అంతటా శాసనాల రూపంలో భద్రపర్చినట్లు బుక్‌లెట్ ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. ఛత్రపతి శివాజీ పాలనా దక్షకుడని, ఆయన పాలనలో ప్రజలు సమాన హక్కులను అనుభవించేవారని బుక్‌లెట్ల ద్వారా కేంద్రం చెప్పుకొచ్చింది. అధికార వికేంద్రీకరణ పద్ధతిని ఆనాడే శివాజీ ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. తన పాలనకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది మంది మంత్రులను శివాజీ ఎలా నియమించాడో ఈ బుక్‌లెట్ వివరిస్తుంది. మంత్రుల సలహాలను రాజు కూడా తోసిపుచ్చలేని పరిస్థితి ఆనాడు ఉండేదని చెప్పుకొచ్చింది.