G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన
జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తన బృందం కృషి కారణంగా దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడినట్లు చెప్పారు. దీనికోసం కృష్టి చేసిన షెర్పా, మంత్రులను మోదీ అభినందించారు. అంతకుముందు దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించాలని మోదీ ప్రతిపాదించగా, దేశాధినేతలు చప్పట్లు, బల్లులను కొట్టద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దిల్లీ డిక్లరేషన్‌పై పూర్తిస్థాయి, తుది ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ డిక్లరేషన్‌లోని అంశాలపై జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ఏమన్నారంటే..
దిల్లీ డిక్లరేషన్ అనేది బలమైన, స్థిరమైన, సమతుల్యమైన, సమగ్ర వృద్ధిపై దృష్టి పెట్టనట్లు ఇండియా జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఎస్‌డీజీపై పురోగతిని వేగవంతం చేయడం, స్థిరమైన భవిష్యత్తు కోసం గ్రీన్ డెవలప్‌మెంట్ ఒప్పందం, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు, మల్టిలేటరలిజాన్ని పునరుజ్జీవింపజేయడం వంటి లక్ష్యాలు దిల్లీ డిక్లరేషన్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. అన్ని అభివృద్ధి, భౌగోళిక-రాజకీయ సమస్యలపై 100శాతం ఏకాభిప్రాయంతో దిల్లీ జీ20 డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రదర్శిస్తుందని వెల్లడించారు. గత జీ20 ప్రెసిడెన్సీల కంటే భారత్ మూడురెట్లు ఎక్కువగా రెట్లు పని చేసినట్లు అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.