Delhi: దావూద్ డీ-కంపెనీతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ ఎన్‌కౌంటర్‌లో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దిల్లీ పోలీసులు, నోయిడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నవంబర్ 16న దిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కార్యాలయానికి సమీపంలో సమీర్ అనే యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమీర్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
వివరాలు
దిల్లీ పోలీసుల బృందం, నోయిడా ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్
ఈ హత్య వెనుక నసీమ్ దురానీ ప్రమేయం ఉన్నట్లు దిల్లీ పోలీసులు అనుమానించారు.
దురానీ, హరూన్ సైఫీ గ్యాంగుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో బులంద్‌షహర్‌లో నసీమ్ దురానీ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే దిల్లీ పోలీసుల బృందం, నోయిడా ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయి.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న సమయంలో దురానీకి, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దురానీని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
వివరాలు
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌తోనూ పరిచయాలు
కాగా, నసీమ్ దురానీకి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దావూద్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చోటా షకీల్‌తోనూ అతడికి పరిచయాలు ఉన్నట్లు సమాచారం.
2016లో తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను హత్య చేసేందుకు చోటా షకీల్.. నసీమ్ దురానీకి బాధ్యతలు అప్పగించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.