Hyderabad: శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల గుట్టు.. బ్లాక్ మార్కెట్ దందా బహిర్గతం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొంతమంది అక్రమదారులు సిలిండర్లను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు బయటపడింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఈ అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు. మొత్తం 10 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 414 వాణిజ్య సిలిండర్లు, 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ అమీర్ శంషాబాద్ కేంద్రంగా "మెట్రో గ్యాస్" పేరుతో ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.
వివరాలు
ఒక్కో సిలిండర్ రూ.6 వేలు
అతడు బంజారాహిల్స్‌లోని నాగార్జున ఎక్స్ రోడ్డు సమీపంలోని ఒక శ్మశానవాటికలో వాణిజ్య సిలిండర్లను గుట్టుగా నిల్వ ఉంచి, అవసరమైన వారికి ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఈ నిల్వ కోసం నెలకు రూ.5 వేల అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యుగేందర్, ఎస్‌ఐ రవిరాజ్ బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి శ్మశానవాటికపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు అమీర్తో పాటు గ్యాస్ డెలివరీ బాయ్స్ మహ్మద్ యూసుఫ్, మహ్మద్ ఇస్మాయిల్, రామారావు, లోక్ కుమార్, మహ్మద్ సక్కుద్దీన్ (కూలీ), మహ్మద్ మంతాజ్ అన్సారీ (వ్యాన్ డ్రైవర్), మహ్మద్ మినాజ్ అన్సారీ (కూలీ), రాజేష్ పాల్ (లారీ డ్రైవర్), రామ్‌రాజ్ సింగ్‌లను అరెస్టు చేశారు.
వివరాలు
ఆస్తుల విలువ సుమారు రూ.21.88 లక్షలు
స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.21.88 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిందితులను కూర్చోబెట్టి వివరాలు వెల్లడిస్తున్న సమయంలో, ఒక ప్రధాన నిందితుడు ఒక్కసారిగా లేచి తాను నిర్దోషినని, కావాలనే కేసులో ఇరికించారని కేకలు వేయడంతో అక్కడ క్షణిక ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు అతడిని పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసుపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.