GATE 2027: గేట్-2027లో కొత్త రోబోటిక్స్ పేపర్.. సిలబస్‌లో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2027 పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసారి పరీక్షలో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేరుతో కొత్త పేపర్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు ఇప్పటివరకు ప్రత్యేక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్‌ను ఇంజినీరింగ్ సైన్సెస్‌లోని సెక్షనల్ పేపర్‌గా మార్చారు. దీంతో కొత్త పేపర్‌ను చేర్చినప్పటికీ మొత్తం పేపర్ల సంఖ్య గత ఏడాది మాదిరిగానే 30గా కొనసాగనుంది. గేట్-2027 నిర్వహణ బాధ్యతలను ఈసారి ఐఐటీ మద్రాస్ చేపట్టింది. సాంకేతిక రంగంలో మారుతున్న అవసరాలు, పరిశ్రమల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల తర్వాత అన్ని పేపర్ల సిలబస్‌ను సవరించినట్లు సంస్థ వెల్లడించింది.
వివరాలు
గేట్ పరీక్షకు బీటెక్ విద్యార్థులతో పాటు ఈ అభ్యర్థులు కూడా అర్హులు
పరీక్షలు 2027 ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 21తో ముగియనున్నాయి.
అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 2026 ఆగస్టు మధ్య నుంచి ప్రారంభమవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఐఐటీ మద్రాస్ తెలిపింది.
గేట్ పరీక్షకు బీటెక్ విద్యార్థులతో పాటు బీఎస్సీ, బీఏ, బీకాం అభ్యర్థులు కూడా అర్హులు.
ఈ పరీక్షలో సాధించిన గేట్ స్కోర్‌కు మూడేళ్లపాటు చెల్లుబాటు ఉంటుంది.
అదే స్కోర్‌తో ఎంటెక్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఏఐసీటీఈ నుంచి కోర్సు పూర్తయ్యే రెండేళ్లపాటు ప్రతి నెల రూ.12,400 చొప్పున స్టయిపెండ్ అందించనున్నారు.