GHMC: హైదరాబాద్ పార్కుల్లో ఎంట్రీ ఫీజు పెంపు.. కొత్త టికెట్ ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సమాచారం అందించింది. నగరంలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పెద్దలకు రూ.10గా ఉన్న టికెట్ ధరను రూ.20కి పెంచింది. అంటే పెద్దల టికెట్ ధర రెట్టింపైంది. అలాగే పిల్లల ప్రవేశ రుసుమును రూ.2 నుంచి రూ.5కు పెంచింది. పెంచిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం
ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పార్కుల ప్రవేశ రుసుము పెంపునకు సంబంధించిన ప్రతిపాదనను చర్చించి ఆమోదించారు.
దీంతో నగరంలోని ఇందిరా పార్కు, నారాయణగూడలోని మేల్కొటే పార్కు, జలగం వెంగళరావు పార్కు, కృష్ణకాంత్ పార్కు సహా పలు ప్రధాన పార్కుల్లో కొత్త టికెట్ ధరలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం 12 ఏళ్లు దాటిన వారిని పెద్దలుగా పరిగణించి ఒక్కొక్కరి నుంచి రూ.20 వసూలు చేస్తారు. ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.5 టికెట్ ధరగా నిర్ణయించారు.
వివరాలు
పార్కుల సమయాల్లో మార్పులేదు
ప్రవేశ రుసుమును పెంచినప్పటికీ పార్కుల సందర్శన వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
గతంలో ఉన్న సమయాల ప్రకారమే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సందర్శకులకు టికెట్లు జారీ చేస్తారు.
జీహెచ్ఎంసీ చివరిసారిగా 2017లో పార్కుల ప్రవేశ రుసుమును సవరించింది. అప్పట్లో రూ.5గా ఉన్న పెద్దల టికెట్ ధరను రూ.10కి పెంచింది.
ఇప్పుడు సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి పార్కుల ప్రవేశ రుసుమును పెంచినట్లు అర్బన్ బయోడైవర్సిటీ విభాగం వర్గాలు వెల్లడించాయి.